📢 **సర్కారు బడుల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమాకానికి ప్రతిపాదనలు**
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమాకానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. అన్ని పాఠశాలలకు కలిపి 6,534 మంది అవసరమని అంచనా వేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన అనంతరం అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనుంది. ఒప్పంద ప్రాతిపదికన విద్యా సంవత్సరం ముగిసే వరకు వీరిని కొనసాగించనుంది.
స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ. 12,500, ఎస్జీటీలకు నెలకు రూ. 10వేల చొప్పున వేతనాలు చెల్లించనుంది. గతేడాది 1,146 మంది నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో ఐదు నెలలకు నియామకాలు చేపట్టింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెంచటం, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత కారణంగా ఈసారి అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల అవసరం భారీగా పెరిగింది. గతంలో బదిలీ అయినా.. ఆ స్థానానికి కొత్తవారు రాకపోవడంతో రిలీవ్ కాకుండా 723 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిని రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలు పూర్తయ్యాక వీరిని రిలీవ్ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.