
ఏపీలో 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ, పూర్తి వివరాలివే! ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వంతు వచ్చింది. ఈ నెల 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.ఈ ఎన్నికల కారణంగా ఉద్యోగులకు ఈనెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం బుధవారం.. పోలింగ్‌కు సంబంధించి గురువారం సెలవుగా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటిస్తారు.
అలాగే పరిషత్ పోలింగ్ రోజున ఉద్యోగులు, కార్మికులకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 35 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ కారణంగా ఆ ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఈ సెలవుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. నవంబర్ 5నన పోలింగ్ రోజు మాత్రమే కాదు.. ఒక రోజు ముందు నవంబర్ 4న స్థానిక సెలవు ప్రకటించనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న నిర్వహంచేందుకు షెడ్యూల్ ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడటంతో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాల్సి వచ్చింది. ఈ నెల 5న పోలింగ్.. ఈ నెల 7న కౌంటింగ్ ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లతో తుది జాబితాను ప్రకటించారు. టీడీపీ నుంచి 19,760మంది, వైఎస్సార్సీపీ నుంచి 17,726 మంది, జనసేన నుంచి 4,330మంది, బీజేపీ నుంచి 1049 మంది, ఇండిపెండెంట్లు 2012 మంది ఉన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 659 స్థానాలకు 4770 నామినేషన్లతో తుది జాబితా వచ్చేసింది. టీడీపీ నుంచి 1693, వైఎస్సార్సీపీనుంచి 1445 మంది, జనసేన పార్టీ 587, బీజేపీ 227 మంది, ఇండిపెండెంట్లు 227 మంది ఉన్నారు.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అనంతరం బ్యాలట్ బాక్సులను సమీపంలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బ్యాలెట్ బాక్సుల్ని ఓట్ల లెక్కింపునకు మంగళవారం ఉదయం మళ్లీ ఓపెన్ చేస్తారు. 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 219 స్ట్రాంగ్ రూముల్లో సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం అధికారులు బాక్సులను పర్యవేక్షించేలా ఏర్పాటు చేసింది APSEC.