👉 *ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం*
*మే 16లోపు దరఖాస్తులకు చివరి తేదీ*
*అనాథల పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ఎస్వీ బాలమందిరం*
తిరుపతి, 2026 ఏప్రిల్ 25: అనాథ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) బాలమందిరంలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను టిటిడి ఆహ్వానిస్తోంది.
దరఖాస్తుదారులు హిందూ మతానికి చెందినవారు అయి ఉండాలి. 27-04-2026 నాటికి 5 సంవత్సరాలు నిండిన, 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఆసక్తి గల వారు ఎస్వీ బాలమందిరంలో లభించే దరఖాస్తు పత్రాలను లేదా తెల్లకాగితంపై తమ వివరాలు రాసి సమర్పించవచ్చు.
దరఖాస్తుతో పాటు తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు, సంరక్షకుల/తల్లిదండ్రుల
ఆదాయ ధృవీకరణ ప్రతులను మరియు బాలబాలికలు జనన , కుల ధృవీకరణ పత్రం అందజేయాలి.
*దరఖాస్తులు పంపవలసిన చిరునామా:*
సహాయ కార్యనిర్వహణాధికారి,
శ్రీ వేంకటేశ్వర బాలమందిరం,
టి.టి.డి, భవానీనగర్, తిరుపతి – 517501.
దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు 0877-2264613 నంబరులో సంప్రదించవచ్చు.
*అనాథ పిల్లలకు జీవనాడి – ఎస్వీ బాలమందిరం*
1943లో ఎస్వీ అనాధాశ్రమంగా ప్రారంభమైన ఈ సంస్థ, అనాథ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన వికాసాన్ని అందించాలనే లక్ష్యంతో 1961లో అప్పటి ప్రధానమంత్రి చాచా జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఎస్వీ బాలమందిరంగా నామకరణం చేశారు. 2014లో ఈ ఎస్వీ బాలమందిరాన్ని శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ పరిధిలోకి టిటిడి తీసుకొచ్చింది.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం వందలాది పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ, వారి సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తోంది.
*ఎంపిక విధానం*
హిందూ మతానికి చెందిన 5 ఏళ్లు నిండిన, 10 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలను రెండు కేటగిరీలుగా ఎంపిక చేస్తారు.
ఏ కేటగిరి: తల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం
బీ కేటగిరి: తల్లి లేదా తండ్రి లేని పిల్లలు టిటిడి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా సంరక్షకులు దరఖాస్తు చేసుకుంటే, నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది.
*విద్య & వసతులు*
ఎంపికైన పిల్లలకు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో, 6వ నుండి 10వ తరగతి వరకు శ్రీ గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలలో విద్య అందిస్తారు.
బాలమందిరంలో విద్యార్థులకు రోజూ పాలు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. పుస్తకాలు, దుస్తులు వంటి మౌలిక అవసరాలను టిటిడి ఉచితంగా అందిస్తుంది.
10వ తరగతి అనంతరం బాలురను ఎస్వీ జూనియర్ కాలేజీలో, బాలికలను ఎస్వీడబ్ల్యూ జూనియర్ కాలేజీలో చేర్పిస్తారు. ప్రతిభ గల విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో కూడా చదువు అవకాశాలు కల్పిస్తున్నారు.
*కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య*
డిసెంబర్ 4, 2025న జరిగిన శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ సమావేశంలో, 10వ తరగతిలో 75 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య అందించాలనే కీలక నిర్ణయాన్ని టిటిడి తీసుకుంది. ఇప్పటికే ఎస్వీ బాలమందిరంలో చదివిన పలువురు విద్యార్థులు ఎస్.ఎస్.సిలో 600కి 580 పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 1000కి 982 మార్కులు సాధించి ప్రతిభను చాటుకున్నారు. మరింత నాణ్యమైన విద్య అందించేందుకు టిటిడి పటిష్ట చర్యలు చేపడుతోంది.
*ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు*
టిటిడి ఎస్వీ బాలమందిరంలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య అనంతరం టిటిడిలో పలు ఉన్నత హోదాల్లోను, ఐటీ రంగంలో, మెడికల్, ప్రభుత్వ ఉద్యోగులు తదితర రంగాల్లో స్థిరపడ్డారు.
*సాంస్కృతిక కార్యక్రమాల్లో అవకాశాలు*
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రముఖ వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎస్వీ బాలమందిరం విద్యార్థులకు టిటిడి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోంది.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల